వాదన /Claim : ఈ వీడియో ద్వారా చైనాలో ఒక రోబోట్ పని చేయడానికి బదులుగా పాత్రలను పగలగొట్టి, ఆపై నాట్యం చేస్తోందని ఒక వాదన చేయబడింది.

నిర్ధారణ/Conclusion : ఈ వాదన తప్పుదోవ పట్టించేలా ఉంది . వీడియో నిజమైనదే మరియు ఒక గందరగోళ సంఘటనను చిత్రీకరించింది,కానీ ఘటన జరిగిన ప్రదేశాన్ని తప్పుగా చైనాకు ఆపాదించారు. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న హైడిలావో హాట్ పాట్ రెస్టారెంట్‌లో జరిగింది.

 రేటింగ్ /Rating : తప్పుదోవ పట్టించే వాదన 

******************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి.

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.

******************************************************

చైనాలో ఒక రోబోట్ గిన్నెలను పగలగొడుతూ, డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక క్లిప్‌ను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసారు. X యూజర్ ‘ట్రిగ్గర్‌హ్యాపీవి1’ ఇలాంటి ఒక పోస్ట్‌ను, “తాజా వార్త: చైనాలో ఒక రోబోట్ పని చేయడానికి బదులుగా గిన్నెలను పగలగొడుతూ, డ్యాన్స్ చేయడం ప్రారంభించింది” అనే క్యాప్షన్‌తో ఒక పోస్టును షేర్ చేసారు.ఈ పోస్టుకు జతగా ఉన్న 21 సెకన్ల వీడియోలో, ఒక రోబోట్ బల్లపై ఉన్న వస్తువులను పగలగొడుతూ ఉండడం, సిబ్బంది ఆ రోబోట్‌ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది, ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు :

ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను’డిజిటై’ బృందం పరిశీలించగా,అది తప్పుదారి పట్టించేలా ఉందని గుర్తించింది.
వీడియోలో కనిపిస్తున్న సంఘటన వాస్తవమైనదే, కానీ దీనిని తప్పుగా చైనాకు ముడిపెట్టారు. వాస్తవానికి, ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న హైడిలావో హాట్ పాట్ అవుట్‌లెట్‌లో జరిగింది.

మరింత సమాచారం కోసం వీడియోలోని క్యాప్షన్లను (అక్షరాలను) పరిశీలించాము. ఆ క్లెయిమ్‌లో షేర్ చేసిన వీడియోలో సుమారు 0:05 సమయం వద్ద, ఇది “కాలిఫోర్నియాలోని ఒక ప్రముఖ చైనీస్ రెస్టారెంట్‌లో” జరిగిందని సబ్‌టైటిల్స్ స్పష్టంగా పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు :

తదుపరి, ఆ వీడియో యొక్క మూలాన్ని నిర్ధారించుకోవడానికి మేము అందులోని వివిధ కీలక దృశ్యాలపై (keyframes) ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ నిర్వహించగా, ‘7NEWS Australia’ అప్‌లోడ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోను గమనించాము ; వీడియో వివరణలో “కాలిఫోర్నియాలోని ఒక చైనీస్ రెస్టారెంట్‌లో అదుపు తప్పిన రోబోట్ గందరగోళాన్ని సృష్టించింది” అని పేర్కొన్నారు తప్ప, ఈ ఘటన చైనాలో జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు –

తర్వాత, మేము వెబ్‌లో అన్వేషించగా, మార్చి 19, 2026న NBC న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక మాకు కనిపించింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగిందని, ఆ రోబోట్ మెడకు పట్టీని బిగించి కంట్రోల్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు అవసరమయ్యారని ఆ నివేదిక ధృవీకరించింది . రోబోట్‌లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, అది సాధారణ పనితీరులో భాగంగా కాకుండా టేబుల్‌కు మరీ దగ్గరగా వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని రెస్టారెంట్ యాజమాన్యం NBC న్యూస్‌కు తెలిపింది. ఆ నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు –

చివరగా, చైనాలో ఇలాంటి సంఘటన జరిగిందా అని అన్వేషించగా, విశ్వసనీయమైన నివేదికలు లేదా ఫలితాలు ఏవీ లభించలేదు. ‘హైడిలావో’ ఒక ప్రముఖ చైనీస్ హాట్ పాట్ రెస్టారెంట్ చెయిన్ అయినప్పటికీ, ఆరోపణలో పేర్కొన్న సంఘటన చైనాలో కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. అన్ని వార్తా కథనాలు ఇది కాలిఫోర్నియాలో జరిగిన ఘటన అనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

కాబట్టి, ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉంది.


మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version