గత నెల కేరళ వరదలలో చిక్కుకున్నవారిని ఆదుకోవాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, బాధితులను అవహేళన చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు. ఈ వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపునే అది వైరల్ అవుతున్నాయి.
కేరళలోని “ముళ్ల పెరియార్ డ్యామ్‌కు వరద తీవ్రత పెరిగి, మరికొద్ది గంటల్లో ఆనకట్ట లీక్ అవుతోంది. మరో గంటలో డ్యామ్ కూలిపోతే ఎర్నాకులం పూర్తిగా మునిగిపోతుంది. PMOలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం చెప్పాడు. ఆ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా వెంటనే సురక్షిత స్థావరాలకు వెళ్లిపోండి,” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ మెసేజ్ ప్రజల్లో భయభ్రాంతుల్ని సృష్టించింది. కొంత మంది సుదూర ప్రాంతాలకు పరుగులు తీశారు. అధికారులు చివరికి అది ఫేక్ న్యూస్ అని తేల్చారు. నెన్మారాకు చెందిన అశ్విన్ బాబు (19) ఈ ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
ఇంకొక దాంట్లోకేరళలోని శబరిమల ఆలయం వద్ద పంబా నదిలో వరదనీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్లలు అంటూ వాట్సాప్‌లో ఓ వీడియో వచ్చింది. కానీఅది కేరళ వీడియో కాదు. గతంలో ఒడిశాను ముంచెత్తిన వరదల సందర్భంలో తీసిన వీడియో. గంజాం జిల్లాకు సంబంధించిన వీడియో అని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
సైన్యం సహాయక చర్యల్లో పాల్గొనకుండా కేరళ ప్రభుత్వం అడ్డుకుంటోంది. భారత సైన్యం సహాయ చర్యల్లో పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించింది,” అంటూ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కూడా ఫేక్ వీడియోనే. వీడియోలో ఉన్న వ్యక్తికి, భారత సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ స్పష్టం చేసింది.
తుపాన్లు, వరదలు లాంటి సమయాల్లో పాత ఫోటోలనే మళ్లీ మళ్లీ షేర్ చేస్తుండటం సోషల్ మీడియాలో ఒక అలవాటుగా మారింది. ‘కొచ్చి వరదల్లో బారులు తీరిన కార్లు’అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఫొటో అయిదేళ్ల కిందటిదని అధికారులు తేల్చారు. వరదలలో ఇళ్లలోకి కొట్టుకొచ్చిన భారీ సర్పాలు అంటూ వచ్చిన కొన్ని ఫొటోలు కూడా ఫేక్‌వేనని చెప్పారు.