కొత్తగా ప్రకటించిన 18% GST అన్ని ఉపయోగించిన కార్ల అమ్మకాలపై వర్తిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పాత కార్ల అమ్మకాలపై 18% GST విధించబడింది.

నిర్ధారణ/Conclusion:తప్పు దారి పట్టించే వాదన.పాత కార్ల వ్యక్తిగత(ఒక వ్యక్తి మరొక వ్యక్తికి) విక్రయాలకు GST వర్తించదు, అయితే పాత కార్లను తిరిగి విక్రయించే డీలర్లు లేదా తరుగుదల పొందిన వారు తమ పాత కార్లను విక్రయిస్తున్నపుడు మార్జిన్‌పై 18% GST వర్తిస్తుంది.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

పాత లేదా వాడిన కార్ల విక్రయాలపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని 12% నుండి 18%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ప్రకటన వెలువడిన వెంటనే, ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియా వాదనలు మరియు ప్రతివాదనలతో హోరెత్తుతోంది.

దావా ఇలా ఉంది:
“నిర్మల సీతారామన్ గారు చెప్పిన ప్రకారం:
నేను నా డీజిల్ కారును 2014లో కొన్నాను : రూ. 24 లక్షలు
నేను నా డీజిల్ కారును 2024లో విక్రయించాను : రూ. 3 లక్షల 2024
కాబట్టి, నేను 21(24-3)లక్షలపై 18% GST చెల్లించాలి! (మార్జిన్ ఆమె చెప్పిన ప్రకారం )”

ఇదే విధమైన వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడ్డాయి

వాస్తవ పరిశీలన

సోషల్ మీడియాలో ఈ చర్చ వైరల్ అవుతుండగా,Digiteye India బృందం సామాజిక మాధ్యమాల్లో ఆర్థిక మంత్రి క్లుప్తంగా చెప్పినదానికి భిన్నమైన వివరణలను కనుగొన్నారు. తన వివరణలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునఃవిక్రయాల యొక్క “మార్జిన్ విలువ”పై పన్నును సూచిస్తూ వివరించారు, అయితే వారు ఉపయోగించిన కార్లను విక్రయించే వ్యక్తులు పన్నుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తప్పుగా సూచించబడింది.

మరిన్ని వార్తా నివేదికలు పరిశీలించగా, వాస్తవానికి పన్ను ఉపయోగించిన వాహనాలు రిసేల్(Resale) చేసే వ్యాపారాలకు వర్తిస్తుంది, ప్రైవేట్ అమ్మకందారులకు కాదని గమనించాము.
ఇంకా, మేము PIBలో భారత ప్రభుత్వం ద్వారా అధికారిక పత్రికా ప్రకటన కోసం చూడగా, “వస్తువులు మరియు సేవలకు సంబంధించిన ఇతర మార్పులు” శీర్షిక కింద, ప్రకటన ఈ విధంగా ఉంది:

“18% వద్ద పేర్కొన్నవి కాకుండా ఇతర EVలతో సహా అన్ని పాత మరియు ఉపయోగించిన వాహనాల అమ్మకాలపై GST రేటును 12% నుండి 18%కి పెంచడం–1200 cc లేదా అంతకంటే ఎక్కువ & 4000 mm లేదా అంతకంటే ఎక్కువ పొడవు కలిగిన పాత మరియు ఉపయోగించిన పెట్రోల్ వాహనాల అమ్మకం; 1500 cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం & 4000 mm పొడవు గల డీజిల్ వాహనాలు మరియు SUVలు.[గమనిక: GST అనేది సరఫరాదారు/సప్లయర్ యొక్క మార్జిన్‌ను సూచించే విలువపై మాత్రమే వర్తిస్తుంది, అంటే, కొనుగోలు ధర మరియు అమ్మకం ధర మధ్య వ్యత్యాసం (తరుగుదల/depreciation క్లెయిమ్ చేయబడితే తరుగుదల/depreciated విలువ) మరియు వాహనం విలువపై కాదు.అలాగే, నమోదుకాని(రిజిస్ట్రేషన్ చేయని) వ్యక్తుల విషయంలో ఇది వర్తించదు.]”

ముఖ్యంగా, పన్ను మూడు స్పెసిఫికేషన్లపై ఆధారపడి ఉంటుంది:
1. పాత మరియు ఉపయోగించిన వాహనాలు అమ్మే ప్రైవేట్ వ్యక్తులు లేదా రిజిస్ట్రేషన్ చేయని వ్యక్తులు మునుపటిలా 12% GSTని కలిగి ఉంటారు, మరియు పెరిగిన 18% GST వారికి వర్తించదు.
2.పాత కార్లపై తరుగుదలని క్లెయిమ్ చేసిన సంస్థలు వాటిని ‘సరఫరాదారు/సప్లయర్ యొక్క మార్జిన్‌(అంటే కొనుగోలు ధర మరియు అమ్మకం ధర మధ్య వ్యత్యాసం(తరుగుదల/depreciation క్లెయిమ్ చేయబడితే తరుగుదల/depreciated విలువ))’పై ఈ GST వర్తిస్తుంది.అంతేకాని వాహనం విలువపై కాదు.
3.పాత కార్లను కొనుగోలు మరియు విక్రయించే కంపెనీలకు ఈ 18% GST వర్తిస్తుంది.

ఈ వీడియోలో ఆర్థిక మంత్రి వివరణ చూడండి:

ఉదాహరణకి, ఒక వ్యక్తిగా మీరు రూ.12 లక్షలకు కారును కొనుగోలు చేసి రూ. 9 లక్షలకు మరొక వ్యక్తికి విక్రయిస్తే, GST వర్తించదు.
కానీ మీరు డీలర్ అయితే కారును రూ.9 లక్షలకు కొనుగోలు చేసి రూ.10 లక్షలకు విక్రయిస్తే, 18% GST కేవలం రూ.లక్ష మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.

అందుకే, పాత కార్ల విక్రయాలన్నింటిలో పెరిగిన GST వర్తిస్తుందనే వాదనలో నిజం లేదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*